by Suryaa Desk | Tue, Nov 19, 2024, 06:55 PM
హార్ట్ ఎటాక్. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడినవారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉండేది. కానీ.. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురువుతున్నారు. పదేళ్లలోపు పిల్లలు సైతం హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం. ఆడుతూ.. పాడుతూ.. నవ్వుతూ.. నడుస్తూ.. ఇలా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంటుంది.
తాజాగా.. ఖమ్మం జిల్లాలో ఓ నాలుగేళ్ల చిన్నారి హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. గ్రూప్-3 పరీక్షల రాసేందుకు వెళ్లిన తల్లి కోసం ఎదురు చూసిన చిన్నారి.. అమ్మను చూడగానే ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో తెలియని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండపోటుతో చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక(4).
సోమవారం (నవంబర్ 18) గ్రూప్-3 పరీక్షలు రాసేందుకు తల్లి లావణ్య పరీక్షా కేంద్రానికి వెళ్లింది. చిన్నారి ప్రహర్షిక నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ కాలం గడిపింది. మధ్యాహ్నం పరీక్ష అయిపోగానే.. తల్లి లావణ్య ఇంటికి వచ్చింది. తల్లిని చూసి ప్రహర్షిక పరిగెత్తుతూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఆమె వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తల్లి వద్దకు చేరుకోక ముందే మధ్యలోనే కుప్పకూలిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లి.. చిన్నారి వద్దకు వెళ్లగా.. ఛాతీలోనొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చిన్నారి ప్రహర్షిత మృతి చెందినట్లు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎప్పుడూ చలాకీగా, సరదాగా ఉండే ఒక్కగానొక్క కుమార్తె చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించాయి. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలిక కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయి.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.