by Suryaa Desk | Fri, Jan 31, 2025, 04:34 PM
బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో సంభాషించారు. శిక్షణ తరగతుల్లో చెబుతున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి చర్చించారు.అకాడమీలో భోజనం ఎలా ఉందని? నీటి సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలు, శిక్షణ తరగతులు, ఇతర అంశాల గురించి శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్స్ ను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీలను ఉద్దేశించి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని.. మీరంతా ఎంతో కష్టపడి, స్వయంకృషితో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.