by Suryaa Desk | Tue, Jan 28, 2025, 07:35 PM
హైడ్రా కూల్చివేతలు మళ్లీ మెుదలయ్యాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్లో గతంలో ఓసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టగా.. తాజాగా మరోసారి బుల్జోడర్లు అక్రమ నిర్మాణాలపై దూసుకెళ్లాయి. పెద్ద చెరువు సమీపంలో వైఎస్సాఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రహారీగోడ నిర్మించారని ఫిర్యాదులు రావటంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు నిజమేనని తేలటంతో కూల్చివేతలు చేపట్టారు.
గతంలో ఇదే ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చినట్లు తెలిసింది. అయినా మళ్లీ అదే ప్రాంతంలో ప్రహరీ నిర్మించటంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు జేసీబీలతో సాయంతో ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. రెండ్రోజుల క్రితం మేడ్చల్ జిల్లా పోచారంలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్ ప్రహరీ గోడను సైతం హైడ్రా కూల్చివేసింది. ఈ కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కృతజ్ఙతలు తెలుపుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, గుట్టల పరిరక్షణే ద్యేయంగా గతేడాది హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాటిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మార్మోగింది. ఆ తర్వాత దాదాపు 300కు పైగా నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.
కాగా, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసేందుకు హైడ్రా ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సోమవారం కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ ఏవీ రంగనాథ్.. రెండు వారాల్లో సమస్యలపై విచారణ చేపట్టకపోతే.. నాలుగో వారం తానే వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేపడతానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు హైడ్రా రక్షించిన ప్రతీ స్థలంలో హైడ్రా ద్వారా పరిరక్షించబడినట్లు బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించారు.