by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:15 PM
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.. నియోజకవర్గంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఆయనే స్వయంగా పంపిణీ చేయటం, కలెక్టర్ ఉండగా ప్రొటోకాల్ పక్కనపెట్టి ఆయననే ముఖ్య అతిథిగా ట్రీట్ చేస్తూ.. విద్యార్థులతో స్వాగతాలు పలికించటం.. ఇలా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఏ హోదాలో తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని ప్రశ్నించింది.
కాగా.. ఈ విషయంపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. నేడు (జనవరి 26) స్పందించారు. రాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో.. ప్రభుత్వం తరపున నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పేంటని సభా వేదికగా ప్రశ్నించారు. తాను రాష్ట్ర పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో.. నియోజవర్గానికి సంబంధించిన పనులను తన సోదరుడు తిరుపతి రెడ్డి చూసుకుంటున్నాడని స్పష్టం చేశారు. తాను పాలన బాధ్యతల్లో మునిగిపోతుండటం వల్ల.. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటున్నారని చెప్పుకొచ్చారు.
ఎలాంటి పదవి లేకపోయిన తిరుపతి రెడ్డి ఎందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లబోదిబోమంటుందని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రజా సేవ చేసేందుకు పదవి ఉండాల్సిన అవసరం లేదని.. ఎలాంటి హోదా లేకుండానే నియోజకవర్గ ప్రజల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించేందుకు కృష్టి చేస్తున్నారని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక పదవి, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇలా ఒక్కొక్కరు ఒక్కో పదవి తీసుకుని దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ.. ఇప్పుడు ఎలాంటి పదవి లేకుండానే.. తన సోదరుడు తిరుపతి రెడ్డి ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తు చేశారు.
కొడంగల్ నియోకవర్గంలోని ప్రజలకు ఏ చిన్న అవసరమొచ్చినా.. కుటుంబ సభ్యునిలా వెళ్లి వాళ్లకు తిరుపతి రెడ్డి అండగా నిలుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో బస్ డిపోను స్థలం కొనిచ్చామని.. స్కూళ్లకు కూడా భూములు ఇచ్చామని.. ఎంతో మందిని ఆర్థికంగా తమ కుటుంబం ఆదుకుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో తాను బిజీగా ఉంటే.. నియోజకవర్గ ప్రజలకు తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటారని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతి రెడ్డిపై తరచూ వస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ప్రతిపక్షాలకు పూర్తి క్లారిటీ ఇచ్చినట్టయింది. తిరుపతి రెడ్డికి ఎలాంటి పదవి లేకపోయినా.. బాజాప్తా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు. కేవలం చెప్పటమే కాదు.. ప్రభుత్వం తరపున నిర్వహించిన అధికారిక కార్యక్రమైన బహిరంగ సభలో మొదటివరసలో.. సీఎస్ శాంతి కుమారి పక్క సీట్లోనే తిరుపతి రెడ్డిని కూర్చోబెట్టి.. అందరికీ బలమైన సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.