by Suryaa Desk | Fri, Jan 24, 2025, 11:44 AM
హైదరాబాద్ లో రోజు రోజుకు అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. తరచూ ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది మరువక ముందే ఇప్పుడు హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ఒక్క సారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ - నిజాంపేట్ ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అలాగే పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడున్నవారంతా హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. అనంతరం సమీప స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.