by Suryaa Desk | Tue, Jan 21, 2025, 05:41 PM
పేదల ఉపాధి జోలికొస్తే తెగించి కొట్లాడతామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయం వద్దకు రాంగోపాల్ పేట, బేగంపేట, మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని పుట్ పాత్ వ్యాపారులు, హాకర్స్ పెద్ద సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యేను కలిసి తమగోడు విన్నవించుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు వాటిని ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారు. ఇప్పుడు తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని విలపించారు.10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఏ రోజు కూడా తమను ఇబ్బందులకు గురి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని బాధితులు ఆవేదనను వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తమకు ఈ కష్టాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఎప్పుడైనా పేదలకు అండగా ఉన్నదని, ఏ రోజు కూడా పుట్ పాత్ వ్యాపారులు, హాకర్స్ ను ఇబ్బందులకు గురిచేయలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.ఈ నెల 23 వ తేదీన GHMC, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి మినిస్టర్ రోడ్, జవహర్ జనతా, మోండా మార్కెట్ డివిజన్ లలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. జీవనాధారం పై దెబ్బ కొడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, రాంగోపాల్ పేట, మోండా డివిజన్‌ల బీఆర్‌ఎస్ పార్టీ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కై లాబ్ యాదవ్, శ్రీహరి, నాగులు, రాములు, ఆరీఫ్, పలువురు పుట్ పాత్ వ్యాపారులు, హాకర్స్ పాల్గొన్నారు.