by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:12 PM
రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా వందకు వంద శాతం రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే.. తనతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు.ఇవాళ షాబాద్ లో చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ వేదికగా రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి కి సవాలు విసిరినా.. ఇంత వరకు సప్పుడు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ )లో తానేదో ఉద్దరించానంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ లో గొప్పలు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ లు అమలు చేసినట్లుగా అక్కడికి వెళ్లి చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో.. అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలతో సహా అందరినీ రేవంత్ నిలువునా మోసం చేశాడని మండిపడ్డారు. ఇంత మందిని మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ ను వదిలిపెట్టాలా.. అని అక్కడున్న జనాన్ని ప్రశ్నించారు.ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు రేవంత్ బాకీ పడ్డారని ఆక్షేపించారు. ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.17,500 చొప్పున రేవంత్ సర్కార్ బాకీ పడిందని కామెంట్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలని అన్నారు. రూ.30 వేలు ఇస్తేనే ఓటు వేస్తామని మహిళలు ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.