by Suryaa Desk | Sat, Jan 11, 2025, 07:26 PM
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దానం వ్యాఖ్యలను పరిశీలిస్తామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అందరి రిపోర్ట్ వద్ద కేసీ వేణుగోపాల్ వద్ద ఉందన్నారు.కాగా, దానం నాగేందర్ ఇటీవల మాట్లాడుతూ... ఫార్ములా ఈ-రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. అందులో అవినీతి జరిగిందా? లేదా? ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతోందని తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ పైవిధంగా స్పందించారు.మహేశ్ కుమార్ గౌడ్ ఇంకా మాట్లాడుతూ... త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు చాలామంది చెప్పారని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని వెల్లడించారు. పార్టీ నేతలంతా రానున్న 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని గట్టిగా పని చేయాలన్నారు. నెలాఖరు నాటికి పార్టీలో అన్ని కమిటీలు వేస్తామన్నారు. పని చేసిన వారికి పదవులు ఇస్తామన్నారు.