by Suryaa Desk | Wed, Jan 08, 2025, 07:50 PM
పటాన్చెరు : జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్చెరు, రామచంద్రపురం, భారతి నగర్ డివిజన్ల పరిధిలో పాత విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు డివిజన్లో పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ స్తంభాల స్థితిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. పాడైపోయిన విద్యుత్ దీపాల స్థానంలో నూతన వాటిని బిగించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న వేసవికాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు నిధుల సమస్య ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి విద్యుత్ విభాగం ఈ ఈ మల్లికార్జున్, డి ఈ లక్ష్మీ ప్రసన్న, ట్రాన్స్కో ఏడి సంజయ్ రావు, తదితరులు పాల్గొన్నారు.