by Suryaa Desk | Thu, Jan 09, 2025, 11:36 AM
తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గత 10 రోజుల క్రితం సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రత్రలు ఉన్నట్లుండి తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి, దట్టమైన పొగ మంచుతో పాటు ఈశాన్య గాలులు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఆయా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్‌లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 14 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయి. నగరవాసులు ఉదయం వేళల వాకింగ్‌కు రావాలంటే భయపడుతున్నారు. పొగమంచు కారణంగా గాలిలో తేమ శాతం కూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరో మూడ్రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించి ఎండ వచ్చేవరకు బయటకు రాకూడదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, రెండేళ్లలోపు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత సమస్యల వస్తాయని.. వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.