by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:03 PM
ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాజేంద్రనగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ ఏ బాలాజీ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా చేవెళ్ల మండల కేంద్రంలోని సత్యసాయి గ్రామర్ హై స్కూల్ లో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ.. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. కార్లు నడిపించే వాహనదారులు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జీబ్రా క్రాసింగ్ లైన్ వద్దనే రోడ్డు దాటాలని మొబైల్ ఫోన్ మాట్లడుకుంటూ రోడ్డు దాటావద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ స్నేహలత, అప్పలనాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.