by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:10 PM
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని షాబాద్ సీఐ కాంతారెడ్డి, చేవెళ్ల ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిలు అన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలలో భాగంగా చేవెళ్ల మండల కేంద్రంలోని స్థానిక వివేకానంద కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ సీ జైపాల్ రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, ఖోఖో, కబడ్డీ క్రీడా పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి సీఐ కాంతారెడ్డి, చేవెళ్ల ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిలు మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసానికి, శరీరదారుఢ్యానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రస్థాయి, జాతీయ పోటీల్లోనూ రాణించాలని తెలిపారు.
క్రమశిక్షణతో చదువుకుంటే విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులువుగా ఛేదించవచ్చన్నారు. విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకొని ఒకరి పట్ల ఒకరు స్నేహ భావం కలిగి ఉండాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ సీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా పోటీలు నాలుగు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు స్వామి వివేకానంద జయంతి రోజున బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.