by Suryaa Desk | Tue, Jan 07, 2025, 07:51 PM
తెలంగాణలో ప్రస్తుతం ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు తీవ్ర రాజకీయ వేడిని పుట్టిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హెచ్ఎండీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తాజాగా మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు.. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించక ముందే.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం.. అత్యున్నత న్యాయస్థానంలో కేవియట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరగనున్నాయి అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారాయి.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదుల బృందం.. సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్.. బుధవారం లేదా గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తరఫు లాయర్లు చెబుతున్నారు. క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఎదురుదెబ్బ తగలడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.
మరోవైపు.. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక పిటిషన్ను దాఖలు చేసింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చనే ఊహాగానాలు రాగానే సర్కార్ అలర్ట్ అయి ముందుగానే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కేవియట్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేయడం వల్ల కేటీఆర్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సమయంలో మధ్యంతర ఉత్తర్వులు లేదా స్టే ఇచ్చే ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫు వాదనలు కూడా సుప్రీంకోర్టు వినడం తప్పనిసరి అవుతుంది. ఒకే వైపు వాదనలు విని తీర్పు ఇవ్వకుండా రెండు వైపులా వాదనలు వినిపించేందుకు ఈ కేవియట్ ఉపయోగపడుతుంది. దీంతో సుప్రీంకోర్టులో ఏం విచారణ జరగనుంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.