by Suryaa Desk | Sun, Jan 05, 2025, 05:11 PM
రైతు భరోసా పథకానికి మంగళం పాడారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతు భరోసా నగదును పెంచామని పొన్నం వివరించారు. ఇక, గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా జరుగుతోందని, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం జరుగుతుందని మంత్రి పొన్నం చెప్పారు.