by Suryaa Desk | Mon, Jan 06, 2025, 12:53 PM
ఎలాగైన తనను ఇబ్బంది పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇవాళ ఏసీబీ కార్యాలయానికి వెళ్లి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆరోపించారు. తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. ఒక తమ వెంట లాయర్లే లేకపోతే.. తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా లీకులిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుతించాలని ఏసీబీ అధికారులను కోరానని కేటీఆర్ అన్నారు.
ఏసీబీ తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. అలాగే ‘తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించి తన నుంచి సమాచారంతోపాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరింది. అయితే అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదు. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని అందులో కోరారు. అదేవిధంగా రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహరిస్తానని తెలిపారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వులో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అవకాశం పరిశీలించాలని’ ఏసీబీ డీఎస్పీ మజిద్ ఖాన్‌ని కోరారు.
నా లాయర్‌ను నాతో రావొద్దని చెబుతున్నారు. రాజమౌళి కంటే మంచి కథలు రాస్తున్నారు. మిమ్మల్ని నమ్మను అని పోలీసులతో చెప్పా. టాలీవుడ్ దర్శకుల కంటే కొత్త కొత్త కథలు రాస్తున్నారని అన్నాను. న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా నాకు ఉన్న హక్కు. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నా. ఇంతమంది పోలీసులు ఎందుకు? న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలి. పోలీసులు ఎందుకు చెబుతున్నారు. హైకోర్టులో ఏసీబీ వాళ్లు గంటలు గంటలు వాదనలు వినిపించారు. ఇవాళ కొత్తగా శోధించి.. సాధించేదేమీ లేదు.