by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:35 PM
తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ఆమడదూరంగా ఉంది. తెలంగాణ రాష్ర్టంలో దేవాలయాలకు ప్రభుత్వం కోట్ల నిధులు కేటాయించిన కొండపోచమ్మ అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నది. కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు కొండపోచమ్మను దర్శించుకోవడం అనవాయితిగా వస్తుంది. కానీ మల్లన్నపై ఉన్న ప్రేమ కొండపోచమ్మపై తల్లిమీద లేకుండా పోతుందని భక్తుల ఆవేదన. కొండపోచమ్మ జాతర ఉత్సవాలు ప్రతిఏటా సంక్రాంత్రి నుండి ప్రారంభమై ఉగాది వరకు మూడు నెలల పాటు కొనసాగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు ప్రతిఏటా రాష్ర్ట నలూములాల నుండి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జాతర సమయంలో అమ్మవారి చెంతకు వచ్చిన మంత్రులు ఆలయ అభివృద్ధిపై హమీలు ఇస్తున్నా ఆచరణలోకి వచ్చే సరికి అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం మారినా ఆలయం అభివృద్ధి ఊసేలేదు. మరో నెల రోజుల్లో జాతర ప్రారంభం కానున్నప్పట్టికి సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడంలో జాప్యం కొనసాగుతుంది. కొండపోచమ్మ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయ అభివృద్ధి మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రతిఏటా అమ్మవారి ఆదాయం దాదాపు 50 నుండి 70 లక్షల వరకు ఉంటుంది, అయిన దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గుడి అవరణలో వసతులు లేక భక్తులకు ప్రతి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. మూడు నెలల పాటు జరిగే ఈ ఉత్సవాలకు కూడా తాతాక్కలిక వసతులు కల్పించలేక పోతున్నారు. నీళ్ల వసతి, మరుగుదోడ్లు, మూత్రశాలలు సదుపాయాలు సరిగా లేవు. జాతర సమయంలో భక్తులు ప్రైవెట్ వ్యాపారులను ఆశ్రయించావలసిన పరిస్థితి ఉంది.
గత ప్రభుత్వం హయాంలో...
2017 నవంబర్ లో మాజీ మంత్రి హరీశ్ రావు పాలక వర్గ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి హజరై కొండపోచమ్మ అభివృద్ధికి వందకోట్ల నిధులు కేటాయిస్తామని యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత డిసెంబర్ 1న అప్పటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. వంద నుండి రెండ వందల కోట్ల నిధులతో యాక్షన్ ప్లాన్ చేసి అభివృద్ధి చేస్తామన్నారు.అలాగే గుడి మందు ఉన్నాచెరువును ట్యాంక్ బండ్ గా మారుస్తామని హమి ఇచ్చారు.కాని నేటికి నిధులు లేక అభివృద్ధికి నోచుకోలేదు. కాని గుడికి సంబందించి గుంట భూమి లేకపోవడంతో 273లో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని అప్పటి తహసీల్దార్ ను ఆదేశించారు. అధికారుల హడవిడి తప్ప భూమిని గుర్తించలేకపోయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొండపోచమ్మను దర్శించుకోని సొంత డబ్బులు కోటి రూపాయాలతో అభివృద్ధి చేస్తానని యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు గుడిని పరిశీలించారు తప్ప అభివృద్ధి ముచ్చట ముందుకు పోలేదు. మంత్రులు ఇచ్చిన మాటలు నీటిమూటలుగా మారిపోయ్యాయి. అలాగే స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ 2019 మే నెలలో కొండపోచమ్మ ఆలయం వద్ద చండియాగం నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. రూ. నలుబై కోట్లతో ఆలయ అభివృద్ధి కి యాక్షన్ ప్లాన్ చేయాలని సిద్దం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయినప్పటికీ అభివృద్ధిలో అడుగు ముందుకు పడలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న విధంగా గత ప్రభుత్వం హామీలు నీటి మూటాలుగానే మిగిలిపోయాయి.
రెగ్యులర్ పాలకవర్గం లేక..
కొండపోచమ్మ ఆలయ పాలకవర్గం గత ఆరేళ్లుగా తాత్కాలిక కమిటీలతోనే కొనసాగుతుంది. రెగ్యులర్ పాలకవర్గం లేదా ఆలయం అభివృద్ధి ముందుకు సాగడం లేదు. ఉత్సవాల సమయంలో దేవాదాయ శాఖ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ఉత్సవాలను ముగిస్తున్నారు తప్పా అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. ఉత్సవ కమిటీ అయినా 14 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా, కొత్తగా పునరుద్దరణ కమిటీని నలుగురు సభ్యులతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు నలుగురు సభ్యులు పాలకవర్గం సభ్యులుగా కోనసాగనున్నారు.
కొత్త ప్రభుత్వంపై ఆశలు...
కొండపోచమ్మ ఆలయ అభివృద్ధి పై భక్తులు, స్థానికులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో హామీలతో గడవగా ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలోనైనా అమ్మవారి ఆలయం అభివృద్ధికి నోచుకుంటుందని భక్తులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం జాతర ఉత్సవాలకు నెల సమయం ఉండడం వల్ల సంబంధిత మంత్రి స్పందించి కనీస వసతుల కల్పన చర్యలు తీసుకుని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఆలయం వద్ద మూత్రశాలాలు, మరుగుదోడ్లు నిర్మణ పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అలాగే పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.