by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:50 PM
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో దీన్ని నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ హాజరయ్యారు. గత ఏడాది డిసెంబరు 28న ఈ టెర్మినల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు.
‘‘ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నాం. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నాం. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వీటిలో స్లీపర్ వంటి సౌకర్యాలను కల్పించనున్నాం. కొత్త రైల్వే ట్రాక్‌లతో పాటు అండర్ బ్రిడ్జి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాం. చర్లపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తయింది. వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తెచ్చాం. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుంది. రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోంది.’’ అని మోదీ చెప్పారు.