by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:19 PM
అక్రమ పేలుళ్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా?అక్రమంగా పేలుళ్లు జరుపుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అధికారుల నిర్లక్ష్యానికి కారణం ఏమై ఉంటుంది?అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.హన్మకొండ-జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్ ఏడాది నుంచి గుట్టల్లో అక్రమ మట్టి దందా సాగిస్తున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్ పై చర్యలకు వెనకడుగు వేయడంలో ఆంతర్యం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు.కాంట్రాక్టర్ అక్రమంగా మట్టిని తరలిస్తూ..పేలుడు పదార్థాలు వినియోగిస్తూ..ఇష్టారాజ్యంగా గుట్టలకు బ్లాస్టింగ్ లు చేస్తూ బండరాళ్ళను తీసి ప్రభుత్వానికి రాయల్టీ ఎగవేస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి,నిజాయితీ గూడెం,తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్,మల్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న గుట్టల్లో రోడ్డు కాంట్రాక్టర్ గత ఏడాది కాలంగా వేలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు.మట్టితో పాటు బండను తీసేందుకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు వాడుతూ పేలుళ్ళు జరుపుతున్నాడు.జిలిటెన్ స్టిక్స్,డిటోనేటర్లు,పేలుడు సామాగ్రి వాడుతూ భారీ ఎత్తున బ్లాస్టింగ్ లు జరుపుతూ బండను తొలగిస్తున్నాడు.ఆయా గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టల మట్టిని టిప్పర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాడు.గుట్టల్లో అంతా అక్రమ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతూ కాంట్రాక్టర్ యొక్క అక్రమ దందాను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.రోడ్డు కాంట్రాక్టర్ పై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా? వేచి చూడాలి మరి.