by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:01 PM
సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలంలోని బంధంపల్లి లోని విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు మరింత లాభం లబ్ధి చేకూరుతుందని, వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా నాట్లు వేసిన తర్వాత డ్రోన్ ద్వారా పురుగుల మందు, గడ్డి మందు స్ప్రే చేయడం, ఎరువుల వినియోగం జరుపవచ్చని అన్నారు.బంధంపల్లి లోని శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ 2024 జనవరిలో ప్రారంభించి సంవత్సర కాలంలో పెద్దపల్లి జిల్లాలో 22 డ్రోన్స్ విక్రయించడం జరిగిందని.
ఈ డ్రోన్స్ కు సర్వీస్ సెంటర్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రస్తుతం విగ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్ వద్ద 5 డ్రోన్లు అద్దె పద్ధతిలో అందించేందుకు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు విగ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ ద్వారా 2 బ్యాచ్లలో శిక్షణ అందించడం జరిగిందని, వీరికి త్వరలో సర్టిఫికేషన్ కూడా అందిస్తామని అన్నారు. రానున్న రోజులలో డ్రోన్స్ సౌలభ్యం మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ద్వారా సబ్సిడీలను వినియోగిస్తూ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ అందించి మరింత విస్తృతంగా వ్యవసాయ యాంత్రికరణకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆది రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.