by Suryaa Desk | Sun, Jan 05, 2025, 06:35 PM
కోయ జాతికి చెందిన తాను కాంగ్రెస్ ఇచ్చిన అవకాశంతో మంత్రి పదవి చేపట్టానని మంత్రి సీతక్క గుర్తుచేశారు. తాను ఎంత సున్నితమో అంత కఠినం కూడా అని.. సీతక్క చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో.. జిల్లా పంచాయతీ అధికారులతో సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే... గ్రామీణాభివృద్ధి, పల్లెల్లో పారిశుద్ధ్యం, ప్రజల సంక్షేమంపై సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డీపీఓలదేనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని.. గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించి.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి సూచించారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోయినా, ఒత్తిడి తట్టుకుని పనిచేసిన డీపీఓలను మంత్రి సీతక్క అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని.. అందుకే ఉద్యోగాన్ని కేవలం పనిగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సిబ్బందితో అధికారులు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ.. పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి.. పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
"నా శాఖను నేను నా కుటుంబంగా భావిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ మన అందరిదీ. మీరూ దీన్ని కుటుంబంగా భావించి పని చేయాలి." అని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సఫాయి కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర ఎంతో ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో వీరి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో.. ఇకపై ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా కాకుండా కమిషనర్ కార్యాలయం నుంచే జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
వేసవిలో తాగునీటి సమస్యల నివారణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. సరఫరా చేసే తాగు నీటిపై ప్రజల్లో నమ్మకం కల్పించడమే లక్ష్యమని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కింది వర్గాల సామర్థ్యంపై ఉన్న దురాభిప్రాయాలను తమ పనితీరుతో తప్పనిసరిగా నిరూపించాలని మంత్రి సీతక్క అన్నారు.