by Suryaa Desk | Tue, Jan 07, 2025, 03:57 PM
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. తమ కార్యాలయంపై దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని అన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇతర పార్టీల కార్యాలయాలపై రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? అని మండిపడ్డారు. రాళ్లు పిల్లలకు, వృద్ధులకు తగిలితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా? అని ప్రశ్నించారు. ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే... వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.