by Suryaa Desk | Sun, Jan 05, 2025, 06:55 PM
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుండటంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. కొన్ని బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు. పథకం అమలుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ బస్సు ప్రయాణికుల సంఖ్య దాదాపు 25 లక్షలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 60 లక్షలకు చేరుకుంది. దీంతో రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకు మెుగ్గు చూపుతున్నారు.
తాజాగా.. బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం తీపి కబురు చెప్పింది. హనుమకొండ-హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాలుష్య రహితంతోపాటు ఇంధన భారం తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ అద్దె ప్రాతిపదికన నడపుతోంది. అందు కోసం జేబీఎం సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైవర్లు, నిర్వహణ బాధ్యత కూడా ఆ సంస్థే చూసుకోంది. ఆర్టీసీ తరఫున కండక్టర్లు మాత్రమే ఉండనున్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బ్ససులు వరంగల్-2 డిపో కేంద్రంగా నడపనున్నారు. డిపో ఆవరణలోనే బస్సులకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లు సైతం ఏర్పాటు చేశారు.
ఇక మార్చిలోపు తెలంగాణ వ్యాప్తంగా 799 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్ని రోడ్డెక్కించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇటీవల వెల్లడించారు. వాటిలో హైదరాబాద్ నగరానికి 353 బస్సులు కేటాయిస్తామన్నారు. మిగిలిన 446 బస్సులను కరీంనగర్, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలకు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని మంత్రి వెల్లడించారు. బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 58 లక్షలకు పెరిగిందని అన్నారు. ముఖ్యంగా డిసెంబరు 30 నాటికి 125.50 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలకు రూ.4,225 కోట్ల డబ్బు ఆదా అయ్యిందని తెలిపారు. కాగా, కొత్తగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తే బస్సుల్లో రద్దీ తగ్గనుంది. ప్రయాణికులు హ్యాపీగా కూర్చొని ప్రయాణాలు చేసే అవకాశం రానుంది.