by Suryaa Desk | Sat, Jan 04, 2025, 07:14 PM
హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తించిన హైడ్రా.. ఇప్పుడు మరో కీలక నిర్మయం తీసుకుంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాను మొదట్లో చాలా మంది వ్యతిరేకించగా.. ప్రస్తుతం హైడ్రా పని తీరుపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికీ చాలా మంది నగరవాసులు హైడ్రాను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం (జనవరి 6వ తేదీ) నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్.. తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్న 2:00 గంటల వరకు ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ స్వీకరించనున్నారు.
ఇకపై ఈ హైడ్రా గ్రీవెన్స్‌ను ప్రతి సోమవారం నిర్వహించనున్నారు. హైడ్రా గ్రీవెన్స్‌కు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌లో పాల్గొననున్నారు. ఈ గ్రీవెన్స్‌లో ముఖ్యంగా నాలాలు, చెరువులు, ఇతర ఆక్రమణలపై న్యాయపరంగా ఇబ్బందులు కాకుండా.. మిగతా ఏ ఫిర్యాదులు వచ్చినా వారం నుంచి 10 రోజుల్లోపు పరిష్కరించే విధంగా హైడ్రా ఓ ప్రణాళికను రూపొందించింది. అయితే.. గత నెలలోనే ఈ హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభంకావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యం కాగా.. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు.
మరోవైపు.. వారం రోజుల్లోనే హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. సంక్రాంతి పండగ నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై రేపు (జనవరి 05న) అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఇకపై హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా సేవలు అందించనున్నారు.
డీఎస్పీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఐలు, ఎస్‌ఐలు కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలు, కుంటల కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఇందులో అత్యధికంగా నగర శివారు ప్రాంతాలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల నుంచి ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి స్థానిక ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది గ్రీవెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వారు హాజరుకానిపక్షంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు.