by Suryaa Desk | Tue, Jan 07, 2025, 12:55 PM
మెట్రోలో అదనపు బోగీల (కోచ్) ఏర్పాటుకు ఎట్టకేలకు హెచ్‌ఎంఆర్‌ఎల్ దృష్టి సారించింది. ఏడాది కాలంగా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా.. ఇంతవరకు కార్యరూపంలోకి రాలేదు. కానీ ఈ నెలాఖరులోగా నగరానికి కొత్త బోగీలను తీసుకువచ్చేలా హెచ్‌ఎంఆర్‌ఎల్ చర్యలు చేపట్టింది. ఇందుకు గాను రద్దీగా ఉండే మార్గాలను తొలి దఫా అందుబాటులోకి తీసుకు రానున్నారు. అమీర్‌పేట్, రాయదుర్గ్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వంటి స్టేషన్లను విపరీతంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, నాలుగు అదనపు కోచ్‌లను నాగ్‌పూర్, పుణే మెట్రో నుంచి లీజుకు తీసుకోనున్నట్లుగా తెలిసింది. గడిచిన కొంతకాలంగా నిత్యం ఐదున్నర లక్షలకు పైగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసు సమయాల్లో నాగోల్-రాయదుర్గ్ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. కిక్కిరిసిన జనాలతో స్టేషన్లన్నీ నిండిపోతున్నాయి. అయినా రద్దీకి అనుగుణంగా బోగీలు అందుబాటులో లేకపోవడంతో.. మరో రైలు వచ్చేంత వరకు ప్లాట్‌ఫాంపై ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా బోగీలను పెంచాలనే డిమాండ్ చేస్తున్నా… అటు మెట్రో కానీ, ఎల్ అండ్ టీ కానీ పట్టించుకోలేదు. తాజాగా ప్రయాణికుల ఒత్తిడి మేరకు బోగీలను పెంచేందుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నిజానికి గత ఏడాది జులై నాటికే కొత్త బోగీలను ఏర్పాటు చేసుకోవాలని మెట్రో భావించింది. కానీ ఎల్ అండ్ టీ ఆసక్తి చూపలేదు. ఇప్పటికే నిర్వహణ భారం పేరిట అరకొర వసతులతోనే సేవలను అందిస్తుండగా.. కొత్త బోగీలు అసాధ్యమేనన్నట్లుగా వ్యవహారించింది. ఇక హెచ్‌ఎంఆర్‌ఎల్ కూడా అంతగా దృష్టి సారించలేదు. దీంతో మెట్రో ప్రారంభమై దాదాపు ఆరేళ్లు గడిచినా కొత్త బోగీల ఊసే లేకుండాపోయింది. అయితే ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్న మెట్రో ప్రయాణికులతో సాధారణ సమయంలోనూ స్టేషన్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడుతున్నది. ఈ క్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎట్టకేలకు కొత్త బోగీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. తొలి దఫా నాలుగు బోగీలను లీజ్ ప్రతిపాదికన తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. దీనికోసం పుణే మెట్రో నుంచి ఇంజన్ రహిత బోగీలను తీసుకురానున్నారు.