by Suryaa Desk | Sun, Jan 05, 2025, 08:06 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగ. పల్లెల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకుంటారు. పండక్కి ఊరెళ్లేందుకు నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ట్రైన్స్, బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటారు. ఇక సంక్రాంతి పండగ అంటే విద్యార్థులు కూడా ఎగిరి గంతేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ తర్వాత సంక్రాంతికి ఎక్కవగా సెలవులు ఇస్తుంటారు. దీంతో ఆ పండగ అంటే విద్యార్థులు ఎంజాయ్ చేస్తారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ఇంకా క్లారిటీ రాలేదు. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు తగ్గిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి అకడమిక్ క్యాలెండర్‌లో జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే జనవరి 11న రెండో శనివారం, 12న ఆదివారం రానుంది. 13వ తేదీన భోగి, జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున జనరల్ పబ్లిక్ హాలిడేస్ ప్రకటించారు. ఇక జనవరి 15న కనుమ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. కాబట్టి ఈరోజున కూడా కొన్ని పాఠశాలలు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఇవన్నీ కలుపుకుంటే.. స్కూళ్లకు వరుసగా 7 రోజులు సెలువులు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ ఏడు రోజుల సెలవులపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. త్వరలోనే సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అటు ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించారు. ఏపీలో సంక్రాంతి సెలవులు తగ్గిస్తారనే ప్రచారం జరిగింది. గతేడాది కురిసిన వర్షాలకు సెలువులు ఇవ్వగా.. సంక్రాంతి సమయంలో వాటిని కవర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే చర్చ జరిగింది. అయితే సెలవులు తగ్గించే యోచన లేదని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ సంక్రాంతి సెలవులపై కూడా క్లారిటీ రానుంది.
కాగా జనవరి 1న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలీడే ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 10న రెండో శనివారం రోజు సెలవును రద్దు చేసింది. జనవరి 1న ఇచ్చిన సెలవుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారం రోజున స్కూళ్లు తెరవనున్నట్లు సర్కార్ ఇప్పటికే ప్రకటించింది.