by Suryaa Desk | Sat, Jan 04, 2025, 04:59 PM
మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.పిల్లలతో రోజూ బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగంలో మాతృ భాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలని పేర్కొన్నారు.''వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాలి. బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలి. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలి. కొత్త సాంకేతికత, కార్యక్రమాలను మాతృభాషలోనే చేపట్టాలి. వాడుక భాషలో 30 శాతమే తెలుగు ఉంది. 70 శాతం ఆంగ్ల పదాలే ఉన్నాయి. మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్య ఉండాలి. కేంద్రం తెచ్చిన కొత్త విధానాన్ని అమలు చేయాలి. ప్రాంతీయ భాష పరిరక్షణకు పెద్దల సహకారం కావాలి. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలి. కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి'' అని కిషన్ రెడ్డి అన్నారు