by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:47 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా కృషి చేయాలని మానకొండూర్ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. శనివారం బెజ్జంకి మండలకేంద్రంలోని సత్యార్జున గార్డెన్ లో నిర్వహించిన మండల కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని, గెలుపు లక్ష్యంగా అందరం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు మరింత చేరువ కావాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. గత పదేళ్ల లో కేసీఆర్ సాగించిన నిరంకుశ పాలన, ఏడాదిగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా పాలన గురించి, పాలనలో తేడాలు గురించి వివరిస్తూ ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలన సాగించారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకనే రాష్ట్రంలో ప్రజల అభీష్టానికి అనుగుణంగా ప్రజాపాలన సాగుతున్నదన్నారు. గత ప్రభుత్వం 200, 300 ఎకరాలు ఉన్న బడా రైతులకు కూడా రైతు బంధు ఇచ్చి ఈ పథకాన్ని దుర్వినియోగపర్చిందని ఎమ్మెల్యే విమర్శించారు., కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా అర్హులైన రైతులు మాత్రమే అందిస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు,నిరుపేదలకు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంక్షేమ పథకాలు శరవేగంగా అమలుకు నోచుకుంటున్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పదేళ్లలో గత ప్రభుత్వం చేయలేని పనులకు ఈ ప్రభుత్వం 11 నెలల్లోనే చేయగలిగిందన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగేళ్ల గడువుందని, ఇచ్చిన హామీలన్నింటి పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలిచ్చిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
అందరికీ ఆరోగ్యం, ప్రతి పేదకు ఇల్లు అందించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం విద్య,వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను మర్చిపోయిందని, బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాల లు అనేకం అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ కొనసాగుతున్నా వాటి సొంత భవనాలు నిర్మించాలన్న సోయి కేసీఆర్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి వాటి అభివృద్ధి పాటుపడుతోంద న్నారు. మానకొండూర్ నియోజకవర్గంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలను సందర్శించినప్పుడు సమస్యలు తెలుసుకొని మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేసినట్టు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివరించారు. పదేళ్లలో మెస్ చార్జీలు పెంచకపోవడం వల్ల హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు,పార్టీ బలోపేతం తదితర అంశాలపై పార్టీ నాయకులు,కార్యకర్తలకు ఎమ్మెల్యే దశాదిశ నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మండల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, ఎఎంసీ వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్సయ్య, శ్రావణ్ కుమార్ , శ్రీకాంత్,సాదిక్, శరత్ కుమార్,అమరాజు నవీన్,గుగ్గిళ్ల శ్రీనివాస్, జెల్ల ప్రభాకర్, మధుకర్ రెడ్డి, సందీప్,చెప్యాల శ్రీనివాస్, పర్ష సంతోష్, ఎండీ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.