by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:10 PM
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు ఐడి కార్డు బహుకరణ, క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి చైర్ పర్సన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి తో కలిసి క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన చైర్ పర్సన్ గారు ప్రధానోపాధ్యాయులకు ఐడి కార్డులు బహుకరించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు వేయడం జరుగుతుందని గుర్తు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఎస్సీ వేసి ఖాళీలను పూరించడం జరిగింది అన్నారు.
అలాగే యువతని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు వేసి ఉద్యోగాలు భర్తీ చేస్తుంది అన్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. హరిలాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామ్ రెడ్డి, ట్రెజరర్ డి.రాములు, పాండు, సంఘం నాయకులు, సభ్యులు, జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.