by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:42 PM
జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు.ఆసిఫాబాద్‌లోని దేవునిగూడ గ్రామంలోని ఆదివాసీ గోండు అక్కాచెల్లెళ్ళతో ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు చూపించిన ఆప్యాయతకు, అభిమానానికి కవిత హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజల తరఫున ఎవరు తమ గళం వినిపించినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నదని ఆమె మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నదని, అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆరోపించారు.ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించి రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని కవిత విమర్శించారు.