by Suryaa Desk | Sun, Jan 05, 2025, 05:19 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో పవర్ స్టార్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన రేణూ దేశాయ్... తన కుమారడు అకీరా సినీ రంగ ప్రవేశంపై స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లినా, అకీరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నాడని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో ఒక తల్లిగా తనకు కూడా ఎంతో ఆసక్తిగా ఉందని అన్నారు. అయితే, సినిమాల్లోకి వచ్చే విషయం పూర్తిగా అకీరా నిర్ణయం మీదనే ఆధారపడి ఉందని రేణూ దేశాయ్ స్పష్టంచేశారు. ఎప్పుడు రావాలనేది అతడే నిర్ణయించుకుంటాడని తెలిపారు. పుణేలో విద్యాభ్యాసం చేసిన అకీరా... కొంతకాలంగా అమెరికాలో ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు, పియానో వాయించడంలోనూ నైపుణ్యం సంపాదించాడు. మరి, అకీరా తన తల్లిదండ్రుల్లా నటన వైపు వస్తాడా, లేక సంగీతాన్ని కెరీర్ గా ఎంచుకుంటాడా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.