by Suryaa Desk | Sat, Jan 04, 2025, 07:10 PM
మాజీ సీఎం కేసీఆర్.. దేశంలో చక్రం తిప్పే రోజు ముందుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శనివారం (జనవరి 04న) రోజున సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రేవత్ రెడ్డి సర్కారుపై సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావటం లేదని దుయ్యబట్టారు.
రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్ మాస్టర్ అంటూ విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా.. లేదా.. తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదని చెప్పుకొచ్చారు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని మాట తప్పారన్నారు. ఎప్పుడైనా నాట్లు పడే సమయానికి అకౌంట్లలో పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతులు ప్రమాణ పత్రం రాయడమేంటని కేటీఆర్ నిలదీశారు.
మేడిగడ్డకు పర్రె పడలే.. రేవంత్ రెడ్డి పుర్రెకు పడిందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా కుట్ర చేస్తోందనేదన్న అనుమానం తనకుందని కేటీఆర్ తెలిపారు. ఈ ఏడాది పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోందని కేటీఆర్ తెలిపారు. ప్రేక్షకుల్లా చూస్తూ ఉండొద్దని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు.. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టమని కేటీఆఱ్ హెచ్చరించారు. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పుతారని.. ఆ రోజు ముందుందంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కొడంగల్ భూములివ్వని కేసులో కూడా తనను ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పిన కేటీఆర్.. మొత్తం ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దామని తెలిపారు. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలన్నారు. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు..? మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు..? అంటూ కేటీఆర్ నిలదీశారు.