by Suryaa Desk | Sun, Jan 05, 2025, 08:58 PM
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవారిని పట్టి పీడిస్తోందని.. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభం అవుతుందని సీఎం చెప్పారు.
కాగా, రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డుల జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొదట కొత్త కార్డుల కోసం అర్హుల నుంచి అఫ్లికేషన్లు స్వీకరించనున్నారు. విధివిధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాల్ని సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది. కాగా అఫ్లికేషన్లు జనవరి 15 నుంచి స్వీకరించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు... చేర్పులు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయనున్నట్లు తెలిసింది.
ఇక కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటివరకు అర్హులు ఆన్‌లైన్‌లో మీ-సేవలో దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనే అఫ్లికేషన్లు తీసుకోవాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు, నగరాల్లో అయితే బస్తీ సభలు నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని డిజిటలైజేషన్ చేసి.. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా అర్హులకు ఈనెల 26 నుంచి కొత్త కార్డుల జారీప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఆయా అఫ్లికేషన్లను ఆమోదించాలని సర్కార్ నిర్ణయించింది. పెళ్లిళ్లు చేసుకున్నవారి పేర్లు మార్పు.. పిల్లల పేర్లు యాడ్ చేయటం వంటి అప్లికేషన్లు 12 లక్షలకుపైగా రాగా.. వాటికి ఆమోదం తెలపనున్నారు. గతంలో రేషన్ కార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి... ఫిజికల్ కార్డులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.