by Suryaa Desk | Sat, Jan 04, 2025, 04:28 PM
మహాత్మ జ్యోతిబా ఫూలే సతీమణి, బాలిక విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో శుక్రవారం సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేసారం గ్రామానికి చెందిన బక్కని లావణ్య, శ్రీనివాస్ యాదవ్ దంపతులు మహిళా ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉండడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. మహిళలను అక్షరాస్యులుగా మార్చడానికి సావిత్రిబాయి ఫూలే జీవితాంతం కృషి చేశారని, ఆమె త్యాగాన్ని గుర్తించడం సంతోషించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంతారం పాఠశాలలో ఘనంగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రముఖ సంఘసంస్కర్త, ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలతో పాటు అనేక విద్యాసంస్థలను స్థాపించి మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక ఉద్యమకారిని, భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కీ.శే. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామారావు ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పిస్తూ, సావిత్రిబాయి సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తాము ఈరోజు ఇలా ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైన సావిత్రిబాయి ఫూలే సేవలను కొనియాడారు. విద్యార్థులు జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలేలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.