by Suryaa Desk | Sun, Jan 05, 2025, 03:33 PM
కాంగ్రెస్ తెలంగాణ రైతులను నిలువునా మోసం చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రైతాంగం ఆ పార్టీని ఎప్పటికీ క్షమించదన్నారు.ఓట్ల కోసం కాంగ్రెస్ తప్పుడు హామీలిచ్చిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధువుగా.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రాబందుగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.''ఆనాడు రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తే బిచ్చం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే.. వెంటనే వస్తానని రాహుల్‌గాంధీ అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాహుల్ ఎక్కడున్నారు? దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రం అప్పులపాలైందని ప్రచారం చేస్తున్నారు. బాగోలేనిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. మీ మానసిక పరిస్థితి. సరిదిద్దాల్సిన స్థానంలో కూర్చొని రాష్ట్రం గురించి తక్కువగా మాట్లాడతారా? వందరోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారు.
రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సీఎం చెప్పారు. 'ఇది నామాట కాదు.. సోనియాగాంధీ మాట' అని అనాడు చెప్పారు. రైతు భరోసా గురించి రేవంత్‌రెడ్డి చెప్తే నమ్మడం లేదని.. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీతో చెప్పించారు. ఇది డిక్లరేషన్ కాదు.. రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అని రైతు భరోసా గురించి ఆనాడు రాహుల్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్‌రెడ్డి. హైడ్రా, మూసీ పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు?'' అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతాంగానికి సంఘీభావంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భారాస శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.