by Suryaa Desk | Sat, Jan 04, 2025, 06:55 PM
హైదరాబాద్ శివారులోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో.. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలో కెమెరాలు పెట్టి సీక్రెట్‌గా వీడియోలు తీశారంటూ విద్యార్థులు చేసిన ఆందోళనలు ఇంకా సద్దుమణగనే లేదు.. అచ్చం అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో.. గర్ల్స్ బాత్రూంలో మొబైల్ కెమెరాలు పెట్టి సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్న ఘటన కలకలం సృష్టిచింది.
ఈ ఘటనపై కాలేజీ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని దగ్గరున్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతనొక్కడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడా.. గ్యాంగ్ ఏమైనా ఉందా.. విద్యార్థినిల వీడియోలు వేరే ఎవరికైనా పంపించాడా.. సోషల్ మీడియాల్లో ఏమైనా అప్‌లోడ్ చేశాడా.. ఇలాంటి పని ఎందుకు చేస్తున్నాడు.. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇప్పటికే సీఎంఆర్ కాలేజీ ఘటన వెలుగులోకి రావటంతో.. రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందులోనూ.. ఏకంగా 300 వీడియోలు తీశారంటూ ప్రచారం కావటంతో మరింత సంచలనంగా మారింది. ఈ ఘటనతో.. రాష్ట్రంలో విద్యార్థినులంతా భయపడాల్సిన పరిస్థితి ఎదురైంది. పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలోని బాత్రూంలలో సీక్రెట్‌గా కెమెరాలు పెడుతున్నారంటూ తరచూ వస్తున్న వార్తలతో.. అటు అమ్మాయిలే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మాయిలను హాస్టళ్లకు పంపించాలంటేనే జంకుతున్నారు.
తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్న సమయంలో.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. కొందరు ఆకతాయిల్లో మాత్రం మార్పు రావటం లేదు. పవిత్రమైన విద్యాలయాల్లో మలినమైన ఆలోచనలతో ఇలాంటి చెత్త పనులకు పాల్పడుతుండటం శోచనీయం. మరి ఈ వరుస ఘటనల నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.