by Suryaa Desk | Mon, Jan 06, 2025, 07:39 PM
జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పోలీసులు రాంగోపాల్‌పేట మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్‌ను వెంటాడుతూనే ఉంది. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటమే కాకుండా.. ఇందులో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చుతూ అరెస్టు కూడా చేశారు. అయితే.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో బన్నీ విడుదల కాగా.. ఇటీవలే నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కొన్ని కండీషన్లు పెట్టింది. ప్రతి ఆదివారం స్టేషన్‌కు వచ్చి పోలీసుల ముందు హాజరవ్వాలని ఆదేశించింది. ఇక్కడితో అయిపోయిందనుకుంటే.. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు.
శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లినా.. తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ముందుస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉంచాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ తమకు సమాచారం ఇవ్వకుడా ఆసుపత్రికి వస్తే పూర్తి బాధ్యత మీదేనంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా.. రెగ్యూలర్ బెయిల్ వచ్చిన నేపథ్యంలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తారన్న ప్రచారం జరగటంతో.. పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కాగా.. ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ కుటుంబం.. శ్రీతేజ్‌ని పరామర్శించేందుకు వెళ్లలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇన్ని రోజులు కేసు కోర్టులో ఉండటం, అల్లు అర్జున్ అక్కడికి వెళ్లొద్దన్న ఆదేశాలతో వెళ్లలేకపోయారు. కాగా.. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకపోవటంతో.. శ్రీతేజ్‌ను చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. సంథ్య థియేటర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని.. పోలీసులు ముందుగానే అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేయటం గమనార్హం.