by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:18 PM
ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు ప్రతినెల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మంగళవారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేషం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేషం మాట్లాడుతూ.. రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డుపై నడవడం, పాదచారుల సిగ్నల్ వంటి వాటి గురించి విద్యార్థులకు వివరించారు. హెల్మెట్ ధరించడం, ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి వాటి వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ భూపాల్ శ్రీధర్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. అతి వేగంతో, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో, నడిపే వారితోపాటు ఎదుటి వారు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. నేటి సమాజంలో పెరుగుతున్న ఆధునికతతోపాటు సైబర్ క్రైంలు, మోసాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి, చేవెళ్ళ ట్రాఫిక్ ఏఎస్ఐ అశోక్, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.