by Suryaa Desk | Wed, Jan 08, 2025, 07:37 PM
రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం మాయమైపోతోంది. కోపావేశాలు, నేరపూరిత ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటన్నింటి కంటే ఎక్కువగా సైకోయిజం అధికమైపోతోంది. ప్రస్తుతం సమాజంలో వెలుగుచూస్తున్న ఘటనలే దానికి నిదర్శనం. అయితే.. సాటి మనుషులపైనే కాదు.. మూగజీవాల మీద కూడా అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ మనుషులు తమ సైకోయిజాన్ని నిరూపించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ అత్యంత పాశవిక, క్రూరమైన ఘటన ఇప్పుడు సర్వత్రా ఆందోళన, ఆవేదన కలిగిస్తోంది.
కంది మండలం ఎద్దు మైలారం గ్రామ శివారులో ఉన్న ఓ బ్రిడ్జి కింద 20 కుక్కలను అత్యంత కిరాతకంగా చంపేశారు కొందరు దుండగులు. సుమారు 30 నుంచి 35 కుక్కల మూతులు కుట్టేసి, కాళ్లు కట్టేసి.. 40 అడుగుల పైనుంచి కిందకు పడేసి.. వాటి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇందులో 20 కుక్కలు చనిపోగా.. మరో 11 కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కుక్కలను సికింద్రాబాద్ తార్నాక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. పాశవిక ఘటన జనవరి 4వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. కొంతమంది ఈ విషయాన్ని సిటిజన్స్ ఫర్ యానిమల్స్ వారికి సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది.
బ్రిడ్జి కింద పడి ఉన్న కుక్కల శవాలు, వాటి పక్కనే మూలుగుతున్న మరికొన్ని శునకాలను.. చూసిన కొందరు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రిడ్జి కింద తీవ్రంగా గాయపడిన కుక్కలను చూసి.. వంతెన పైనుంచి విసిరేసి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన కుక్కల అవశేషాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
జంతు సంరక్షణ సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ద్వారా జనవరి 4న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సిటిజన్స్ ఫర్ యానిమల్స్ అనే సంస్థతో పాటు, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ, పీపుల్ ఫర్ యానిమల్ అనే సంస్థ సహాయంతో గాయపడిన 11 కుక్కలను రక్షించి.. నాగోల్‌లోని పీఎఫ్ఏ షెల్టర్‌కు తరలించారు. జంతు సంరక్షణ సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని.. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు జంతు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.