by Suryaa Desk | Sun, Jan 05, 2025, 08:01 PM
మరో 10 రోజుల్లో సంక్రాంతి పండగ ఉండగా.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముందే పండగ వచ్చింది. సివిల్స్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. హైదరాబాద్ జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్స్‌కు ప్రిపేరవుతున్న వారికి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసగించారు. యువత సహకారంతోనే రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాం కాబట్టే.. ప్రగతి భవన్ ప్రజాభవన్‌గా మారిందని చెప్పారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బిహార్ నుంచి అనేకమంది సివిల్స్‌కు ఎంపిక అవుతున్నారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో గత పదేళ్ల కాలంలో అటువంటి పరిస్థితి లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో సివిల్స్ రాసే విద్యార్థులకు సహకారం అందించాలనే మంచి ఉద్దేశంతోనే సివిల్స్ అభ్యర్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే దాదాపు 55 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 563 గ్రూపు-1 పోస్టులు భర్తీ చేపట్టామని తెలిపారు.
తమ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్షాల మాత్రం కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పదేళ్లు కాలయాపన చేసిందని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల బాధలు కళ్లారా చూశాం కాబట్టే తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. సివిల్స్ అభ్యర్థులకు తాము చేసేది ఆర్థిక సాయం కాదన్న రేవంత్... ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహకంగా భావించాలని సూచించారు.
ఏదైనా సాధించాలనే తపన, కష్టంతో కూడిన కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందని ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచించారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి 31లోగా 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.