by Suryaa Desk | Sun, Jan 05, 2025, 03:18 PM
సంక్రాంతి పండక్కి ప్రతీ యేట రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి కూడా విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది. మొత్తం 5 రోజులు సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులిస్తూ విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. జనవరి 18వ తేదీన మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. జనవరి 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. వీటితో కూడా కలుపుకుని మొత్తం 7 రోజులు సెలవులు ఇచ్చినైట్లెంది.
ఇటీవల ముగిసిన క్రిస్మస్ సెలవుల్లో స్కూళ్లకు అదనంగా మూడు రోజుల సెలవు అదనంగా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సింగ్‌డే, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంతో డిసెంబర్ చివరలో వరుసగా మూడురోజులు సెలవులొచ్చాయి. విద్యార్థులు సెలవుల నుంచి తేరుకునే లోపే మళ్లీ సంక్రాంతి సెలవులొచ్చేశాయి. ఇక జనవరి 18 (శనివారం) పాఠశాలలు తిరిగి తెరుచుకున్నా.. 19న ఆదివారం కావడంతో మళ్లీ సెలవొచ్చింది.ఇక సంక్రాంతి సెలవు తర్వాత పాఠశాల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28లోగా ఈ పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు జనవరి 13 నుంచి సంక్రాంతి సెలవులు రానున్నాయి. అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంకా సెలవు తేదీలను అధికారికంగా ప్రకటించలేదు.