by Suryaa Desk | Mon, Jan 06, 2025, 07:42 PM
హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ అని.. ఇది ఓల్ట్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ సిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఎవరితో కొట్లాడేందుకైనా.. ఎవరినైనా కలుపుకుని పోయేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అయిన ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఓల్డ్ సిటీపై వరాల జల్లు కురిపించారు. ఆరాఘర్- జూపార్క్ ఫ్లైఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రటించారు.
అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్ అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మించారని.. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ ఏర్పడ్డాక రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించుకున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు. మెట్రో రైలు, రోడ్ల విస్తరణ, శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లాంటి అంశాలను ప్రాధాన్యతగా పెట్టుకున్నామని వివరించారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు సివరేజ్ పనులు కూడా ప్రారంభించినట్టు తెలిపారు.
మూసీ నదిని పునరుజీవింపజేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంద్నారు. నిజాం కాలంలో కాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించి.. నగరానికి తాగునీటి సమస్యలు లేకుండా చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ లేక్ సిటీగా ఉండేదని.. నిజాం చేసిన అభివృద్ధిని కాపాడుకుంటే ప్రపంచంలో హైదరాబాద్ బెస్ట్ సిటీగా ఉండేదని తెలిపారు. చిన్నపాటి వర్షం వచ్చినా నగరంలో వరదలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు.
అక్బరుద్దీన్ ఒవైసీ తనకు చిన్నప్పటి మిత్రుడేనని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రధాని మోదీతో కొట్లాడాల్సి వస్తే కొట్లాడతానని.. అసదుద్దీన్‌తో కలవాల్సి వస్తే కలుస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే.. మోదీతో కొట్లాడి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చామని తెలిపారు.
చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ ప్రారంభ సమయంలో మోదీతో మాట్లాడి.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని కోరినట్టు తెలిపారు. ప్రధాని, తాము వేర్వేరు పార్టీల్లో ఉన్నా కూడా నగర అభివృద్ధి కోసం, పనుల కోసం మాట్లాడానని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే.. నగరంతో పాటు తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రైల్ కూడా కావాలని ప్రధాని మోదీని కోరినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.
మరోవైపు.. మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన పనులన్నింటికీ డబ్బులు మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీలోని గల్లీ గల్లీ తనకు తెలుసని.. చిన్నప్పటి నుంచి ఇక్కడి నుంచే తన సొంతూరికి వెళ్లేవాడినని వివరించారు. మరోవైపు.. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. హైదరాబాద్ అనగానే అందరికి ముందుగా ఓల్డ్ సిటీనే గుర్తుకొస్తుందని.. ఆ తరువాతే ఇతర ప్రాంతాలు గుర్తుకొస్తాయని తెలిపారు. తాము నిర్మించిన ఫ్లైఓవర్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నాడంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే సరైన సమయానికి నిధులు విడుదల చేసి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశామని శ్రీధర్ బాబు కౌంటర్ వేశారు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీధర్ బాబు తెలిపారు.