by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:34 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసుకు సంబంధించి.. అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.ఇవాళ వక్తలు మాట్లాడుతూ.. ఒక మాట అన్నారు.. ఇబ్బందేదో ఉందన్నారు. మనకు నిజంగా ఇబ్బంది ఏమీ ఉంది. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఉండే ఇబ్బందులతో పోల్చితే.. ఇది ఇబ్బందే కాదు.. అదో లొట్టపీస్ కేసు.. వాడొక లోట్టపీస్ ముఖ్యమంత్రి.. చేయగలిగేదేమీ లేదు.. ఇబ్బంది లేదు. కేసీఆర్ ఆనాడు కడుపు మాడ్చుకొని తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సపచ్చుడో.. తెలంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్న ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురి విద్యార్థి నేతల వీపులు విమానం మోత మోగినాయి. యాదయ్య, శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని భగభగమండుతుంటే ఆ ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది.. ఇది లొట్టపీస్ కేసు.. వాడు పీకేది ఏం లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మజిల్ పవర్, మీడియా పవర్ లేదు.. అగమ్యగోచర పరిస్థితుల్లో తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా , కేసీఆర్ రక్తం పంచుకుపుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానేకాదు. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.