by Suryaa Desk | Wed, Jan 08, 2025, 07:56 PM
తెలంగాణలో గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తోన్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే.. మొదటగా నిర్మించదలచిన రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియలోనూ స్పీడు పెంచారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యాదాద్రి జిల్లా అధికారులు.. భూములు కోల్పోతున్న రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తుర్కపల్లి పరిధిలో రెండు గ్రామాల రైతులతో మాట్లాడారు. మెరుగైన పరిహారం ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ రెండు గ్రామాల రైతులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక.. మిగిలిన గ్రామాల రైతులతోనూ అధికారులు చర్చలు జరపనున్నారు.
అయితే.. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి మొత్తం 164 కిలో మీటర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 మండలాల్లోని 24 గ్రామాల్లో 59 కిలో మీటర్ల నిర్మాణానికి 1800 ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లోని రైతులు భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు.
అనాసక్తిగా ఉన్న రైతులకు మంచి పరిహారం ఇచ్చి ఒప్పించి మెప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు.. అధికారులు గ్రామాల బాట పట్టారు. రైతులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్హనుమంత రావు క్షేత్రస్థాయికి వెళ్లి బాధిత రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు. ముందుగా తుర్కపల్లి మండలంలోనే రీజినల్ రింగ్ రోడ్డు ప్రారంభమవుతుండగా అక్కడి రైతులతో చర్చించారు.
భువనగిరి మండలంలో196 ఎకరాలను సేకరించాల్సి ఉండగా.. రాయగిరి గ్రామంలోని 105 ఎకరాలకు చెందిన రైతులు భూమి ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు. సర్వే నంబర్ 215తో పాటు పలు సర్వే నంబర్లలో ఎకరానికి రూ.13.12 లక్షలు, సర్వే నంబర్ 379తో పాటు మిగతా నంబర్లలో రూ.29.40 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. మరింత పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో.. సర్వే నంబర్ 682 తో పాటు పలు నంబర్లలో రూ.36.75 లక్షల వరకు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉండగా.. బహిరంగ మార్కెట్ ఎకరానికి కోట్లలో పలుకుతోంది. అయితే.. రిజిస్ట్రేషన్వ్యాల్యూను బట్టి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలకు పైగా గ్రామానికి చెందిన రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తుండగా.. ఆమేరకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు.. తుర్కపల్లి మండలం కోనాపురం, ఇబ్రహీంపూర్లో 38 ఎకరాలకు చెందిన రైతులను కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ కలిసి మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో ఎకరానికి కోటి రూపాయల డిమాండ్ ఉందని.. తమకు కనీసం రూ.50 లక్షలైనా ఇవ్వాలని రైతులు కోరారు. అయితే.. నేషనల్ హైవే రూల్స్ ప్రకారం ఇక్కడ రిజిస్ట్రేషన్వ్యాల్యూకు మూడు రెట్లు మాత్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని.. ఇలా చూస్తే ఎకరానికి రూ.19 లక్షలే వస్తుందని అధికారులు వివరించారు. అయినప్పటికీ.. ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు చెప్పిన మాటలకు.. రైతులు సానుకూలత వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. మిగిలిన 22 గ్రామాల రైతులతోనూ మాట్లాడి.. అందరిని ఒప్పిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.