by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:23 PM
పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు. జూలపల్లి మండలం కాచాపూర్ నుండి వడ్కాపూర్, జూలపల్లి వరకు రూ.19.80 కోట్లతో నిర్మాణం తలపెట్టిన రోడ్డు పనులకు బుధవారం గౌరవ ఎమ్మెల్యే శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతన ఆరోగ్య కేంద్రానికి అలాగే వడ్కాపూర్ గ్రామంలో పద్మశాలి భవనానికి ₹5 లక్షల రూపాయల నిధులతో స్థానిక నాయకులతో కలిసి శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జూలపల్లి మండలంలో ఉన్న గ్రామీణ రోడ్లకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రూ.12 కోట్లతో కాచాపూర్, నిట్టూరు రోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు.
జూలపల్లి వద్ద గల వాగు పై నూతన వంతెనకు ₹ 5 కోట్ల రూపాయల నిధులతో టెండర్ కు ఆహ్వానించడం జరిగిందని రాబోయే సంవత్సర కాలంలో వివిధ రోడ్లను అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి పనులతో పాటు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గత పది సంవత్సరాల కాలంలో రైతులను, ప్రజలను మభ్యపెట్టి అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ లీడర్లు ఇటీవల కాలంలో ఉనికి కోసం పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తోందని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, పొలాల్లో నాట్లు వేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసినందుకా, రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున చెల్లించనున్నందుకా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఏనాడు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని పాపాన పోలేదని బిఆర్ఎస్ లీడర్లపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.
గత పాలకులు కేవలం తమ స్వప్రయోజనాల కోసమే అధికారాన్ని వాడుకున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రభుత్వంపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం..వారి సంక్షేమం కోసం.. గ్రామాల అభివృద్ధి కోసం.. తాను, తమ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జూలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్, సింగల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్, దారవెన నరసింగ్ యాదవ్, కొమ్ము పోచాలు, దుగ్యాల శ్యామ్ రావు, కందుకూరి అంజయ్య, బండి స్వామి, కోరుకంటి సంపత్, నర్సింగ్, దుగ్యాల శ్యామ్ ప్రసాద్ రావు, మహంకాళి అంజయ్య, మల్లెత్తుల కొమురయ్య, కల్లెపల్లి అంజి, లింగయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.