by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:07 PM
తల్లిదండ్రులను సంరక్షించాల్సిన పూర్తి బాధ్యత పిల్లలదే అని ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని కళానగర్ లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెట్ పల్లి డివిజన్ శాఖ నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం స్వర్ణకార సంఘ భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ భారాన్ని కొందరు పిల్లలు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కని పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు శిక్ష పడేలా ప్రభుత్వం 2007లో చట్టం చేసిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం పిల్లలకు మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని అన్నారు. కుటుంబ సభ్యుల వల్ల నిర్లక్ష్యానికి గురవుతున్న, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వయోవృద్ధులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14567 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
అసోసియేషన్ ద్వారా రూపొందించిన 2025 క్యాలెండర్ ను డిఎస్పి రాములతో కలిసి ఆర్డీవో శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం వయోవృద్ధులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి ప్రకాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల అశోక్ రావు, ఉపాధ్యక్షులు హన్మంత్ రెడ్డి, ఎండి యాకుబ్, మెట్ పల్లి డివిజన్ అధ్యక్షులు ఒజ్జెల బుచ్చిరెడ్డి, కార్యదర్శి సౌడాల కమలాకర్, వెల్ముల ప్రభాకర్ రావు, స్వామి, పబ్బ శివానందం, రాజమోహన్, స్వర్ణకార సంఘం అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి, విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు పులిమామిడి చంద్రయ్య, మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.