by Suryaa Desk | Thu, Jan 09, 2025, 01:56 PM
దివ్యాంగుల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సంపూర్ణ సహకారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పెరేడ్ గ్రౌండ్స్ లో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి అలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపిక కాబడిన దివ్యాంగులకు 27 లక్షల విలువ గల ఉపకరణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గత నవంబర్ నెలలో అలింకో సంస్థ ద్వారా క్యాంప్ నిర్వహించి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులైన దివ్యాంగులను ఎంపిక చేసామని , ఎంపిక కాబడిన దివ్యాంగులకు నేడు 27 లక్షల విలువ చేసే వివిధ ఉపకారణాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే 2 నెలల వ్యవధిలో మరొకసారి క్యాంపు నిర్వహించి ఇంకా ఎవరైనా దివ్యాంగులు పెండింగ్లో ఉంటే వారిని గుర్తించి అవసరమైన పరికరాల పంపిణీకి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని ప్రతి పాఠశాలను ఆర్.బి.ఎస్.కే బృందాలు పర్యటిస్తూ పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారని, ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
చిన్నపిల్లల ఎదుగుదల సమస్యలను గుర్తించేందుకు మన పెద్దపల్లి జిల్లా మాత శిశు ఆసుపత్రిలో డి.ఈ.ఐ.సి సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. జిల్లాలో వినికిడి సమస్య ఉన్న పిల్లలను గుర్తించామని వారికి త్వరలోనే ఉచితంగా వినికిడి యంత్రాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల జీవనోపాధి కోసం వ్యాపార యూనిట్ల స్థాపనకు రుణాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించేందుకు నవంబర్ నెలలో అలింకో సంస్థ ద్వారా ప్రత్యేక నిర్ధారణ క్యాంపు నిర్వహించామని, మన పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 190 మంది దివ్యాంగులను ఎంపిక చేసామని,వారికి నేడు అవసరమైన పరికరాలను అందించడం సంతోషంగా ఉందని అన్నారు.భవిష్యత్తులో మరొక మారు నిర్ధారణ క్యాంపు నిర్వహించి మిగిలిన దివ్యాంగులకు కూడా ఉపకరణాలు అందించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.
మన ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని, గతంలో కంటే ఔట్ పేషెంట్ సంఖ్య, ప్రసవాల సంఖ్య, వివిధ శస్యతల సంఖ్య పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గణనీయంగా పెరిగిందని, దీనికి కృషి చేసిన కలెక్టర్ కు, సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో పెద్దపెల్లి జిల్లా ఆసుపత్రిని వంద పడకలకు విస్తరిస్తున్నామని, నెలాఖరు నాటికి టెండర్ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజలు ఆసుపత్రులలో డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రస్తుతం మన ప్రభుత్వాసుపత్రులలో అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామని వీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల రావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.