by Suryaa Desk | Thu, Jan 09, 2025, 02:58 PM
ప్రభుత్వం పేద ప్రజలకు తినడానికి రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తే కొంతమంది అక్రమార్కులు వ్యాపారంగా మారుస్తూ విక్రయిస్తున్నారు. బుధవారం రాయపోల్ మండలం రామారం గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామారం గ్రామానికి చెందిన ఎలగందుల సతీష్ తన పాత ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 19 బస్తాలు,12.80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వెంటనే అట్టి బియ్యంను దౌల్తాబాద్ పౌరసరఫరాల గోదాంకు తరలించామన్నారు. పంచనామా పూర్తి చేసిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.పేద ప్రజల గురించి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వారి స్వార్థం స్వలాభం గురించి ప్రజల దగ్గర తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని ఎక్కువ రేటుకు వ్యాపారస్తులకు డబ్బులు సంపాదిస్తున్నారని, అలాంటి వారిపై జిల్లాలో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వం రేషన్ బియ్యం కొనుగోలు చేసిన, ఇతరులు అమ్మిన, అక్రమంగా రవాణా చేసిన, పేద ప్రజల పొట్టకొట్టి అక్రమ వ్యాపారం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న సమాచారం ఉంటే రెవెన్యూ అధికారులకు కానీ, డయల్ 100, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి భాను ప్రకాష్ ,టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.