by Suryaa Desk | Tue, Jan 07, 2025, 02:14 PM
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కుతెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని.. అందరికి రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో నిధుల మళ్లింపు జరిగిదంటూ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చుతూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. గతంలో రెండు సార్లు ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా.. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తర్వాతి విచారణలో ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సెక్షన్ 409 అప్లికబుల్ కాదని, కేటీఆర్‌పై పెట్టిన కేసులు ఏవీ కూడా వర్తించవని హైకోర్టుకు కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎఫ్‌ఈవోతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, అలాగే కేటీఆర్ లబ్ధిపొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం దృష్టికి కేటీఆర్ న్యాయవాది తీసుకెళ్లారు. కేటీఆర్ తరపున దాదాపు రెండున్నర గంటల పాటు న్యాయవాది వాదనలు వినిపించారు.
మరోవైపు కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. అందుకే ఆయనను ఏ1గా చేర్చామని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని.. కేటీఆర్‌ను విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి పొందామన్నారు. అలాగే ప్రాథమిక విచారణ తర్వాతే కేసును నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో కేటీఆర్‌ది కీలక పాత్ర ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని క్వాష్ పిటిషన్‌ను డిస్మస్ చేయాలని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు డిసెంబర్ 31న రిజర్వ్ చేస్తూ.. కేసును నేటికి వాయిదా వేసింది. అయితే ఈరోజు తీర్పు చెప్పిన హైకోర్టు.. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కేటీఆర్‌కు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు కేటీఆర్ లీగల్ టీమ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.