by Suryaa Desk | Fri, Jan 10, 2025, 11:34 AM
వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు.భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.