by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:24 PM
మండల పరిధిలోని ముడిమ్యాల గేట్ నుంచి మేడిపల్లి వరకు నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన సభలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని కేసారం గ్రామ రెవెన్యూలోని బృందావన్‌కాలనీలో బీఆర్ఎస్ నాయకులు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకతీతంగా ఉండాల్సిన శాసనసభాపతి ప్రసాద్ కుమార్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ వికారాబాద్ ను జిల్లాగా వేరుచేసి అక్కడ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయడంతోనే ఈనాడు ప్రసాద్ కుమార్ శాసనసభాపతిగా ఉన్నారని అన్నారు.
వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో పరిశ్రమలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో గాని, షాబాద్ మండలంలో గాని విపరీతమైన పరిశ్రమలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చాయని తెలిపారు. సీఎం, స్పీకర్ ఇదే హైవే రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారని, వారికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని హితవు పలికారు. సంవత్సరం కాలం పాలనలో ఉండి కూడా ఎన్జీటీ కోర్టులో ఒక్క కౌంటర్ వేయడానికి కూడా దిక్కులేదన్నారు.
సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బట్టకాల్చి మీద వేయడమే చేస్తున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయలేదని వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని, సిగ్గుచేటైన వ్యాఖ్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సంవత్సర కాలం పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలి పోయిందన్నారు. స్పీకర్ అంటే తమకు గౌరవం ఉండేదని, కానీ సీఎం గాలి తాగిలింది కాబోలు శాసనాసభాపతి అయి ఉండి కూడా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం మానుకొని నిత్యం ప్రమాదాలకు గురవుతున్న హైవే రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి, పూర్తి చేస్తే తాము హర్షిస్తామన్నారు. మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ.. ముడిమ్యాల నుంచి మేడిపల్లి వరకు బీటీ రోడ్డును రూ.24 కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మంజూరు చేసిందని, మేమే ఆ రోడ్డును తెచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ రోడ్డుకు సంబంధించిన జీవోను ఒకసారి చూసుకోవాలన్నారు. అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల హైవే రోడ్డును మంజూరు చేసింది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇప్పుడు టెంకాయలు కొట్టి భూమి పూజలు చేస్తున్న గ్రంథాలయం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందేనని, 111 జీవోను రద్దు చేసి 69 జీవోను తీసుకొచ్చిందని, ఆమధ్య తిమ్మరెడ్డి గూడ దగ్గర ప్రారంభించిన బ్రిడ్జి, ఎట్ల ఎర్రవల్లి, మోకిల నుంచి టంగుటూరు వరకు చివరి దశకు వచ్చిన బ్రీడ్జీ, కొండకల్ గ్రామంలో రైలు కోచ్ ఫ్యాక్టరీ, షాబాద్ మండలంలో దాదాపు అన్ని పరిశ్రమలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏలాగనైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో, వీలంతా సీఎం శిష్యులే కాబట్టి మసి పూసి మారేడు గా చేసే మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ సంవత్సర పాలన కాలంలో సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించలేకపోయిందన్నారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేమీ లేవన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే చూపించాలని అన్నారు. సిగ్గు చేటైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు విఘ్నేశ్ గౌడ్, బ్యాగరి సుదర్శన్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బ్యాగరి నర్సిములు, బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని, దేవరంపల్లి, ఖానాపూర్ మాజీ సర్పంచ్‌లు నరహరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎల్లన్న, తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.